Sammakka Sarakka Real Story || Samakka Sarakka Charitra || Medaram Jatara 2020 || Hello TV
Sammakka Sarakka Real Story || Samakka Sarakka Charitra || Medaram Jatara 2020 || Hello TV
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క
సారక్కల మేడారం జాతర. ప్రతి రెండేళ్ళ కొకసారి జరిగే ఈ జాతరకు ఇసుక వేస్తే రాలనంత
జనాలు కోటికి పైగా భక్తులు మేడారం వచ్చి సమ్మక్క సారక్క లను దర్శించుకొని మొక్కులు
చెల్లించుకుంటారు. భక్తులు మన తెలుగు
రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర , చత్తీస్గఢ్, ఒరిస్సా , జార్ఖండ్ ల నుండి మేడారం జాతరకు
తండోపతండాలుగా వస్తారు. భారతదేశంలో కుంభమేళా తర్వాత అంతటి జనసందోహం హాజరయ్యే ఒకే
ఒక్క జాతర సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి
జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం లో జరుగుతుంది. 1996 లో
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. కొత్తగా
ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఈ మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది.
ఇంతకి సమ్మక్క సారక్కలు ఎవరు? సమ్మక్క సారక్కలు నిజంగానే దివి నుండి
భువికి దిగివచ్చిన దేవతా మూర్తులా లేక మనలాగే ఒకప్పుడు ఈ భూమిపై మానవ రూపంలో
జీవించినవారా? సాధారనంగా పుణ్యక్షేత్రాల్లో దేవాలయాలు కట్టించి అందులో విగ్రహ
రూపంలో ప్రతిష్టిస్తారు. ఎందుకు మేడారంలో అసలు ఎక్కడా సమ్మక్క సారక్క విగ్రహాలు కనిపించవు? మరి
విగ్రహాలు లేకపోతే ఎవరిని పూజించడానికి భక్తులు మేడారం జాతరకి వెళ్తారు? మేడారం
జాతరకు వెళ్ళే భక్తులు బెల్లం ఎందుకు తీసుకెళ్తారు? సమ్మక్క సారక్కల గురించి మీకు
తెలియని మరెన్నో రహస్యాలు ఇప్పుడు తెలుసుకుందాం ....
సమ్మక్క సారక్కల జీవిత చరిత్రను తెలుసుకోవాలంటే మనం 13వ శతాబ్దంలోకి
వెళ్ళాలి. కాకతీయులు ఓరుగల్లును ఏలుతున్న రోజులవి.
ఒకరోజు కోయదొరలు అడవిలో వేటకు వెళ్లగా వారికి అక్కడ ఓ పసి బిడ్డ ఏడుపు
అరుపులు వినిపించాయి. ఇంతటి భయంకరమైన దండకారుణ్యంలో పసిబిడ్డ అరుపులు ఎక్కడినుండి వినిపిస్తున్నాయని
కోయదొరలు అటుగా వెళ్లి చూశారు. అది చూసి
వాళ్ళు ఆశ్చర్యపోయారు. మనం దగ్గరి నుండి చూడాలంటేనే
భయపడే క్రూరమృగాలు పులులు, సింహాలు ఆ బిడ్డ చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తున్నాయి.
కోయదొరలు అటుగా వస్తున్నారని గమనించి పులులు, సింహాలు అక్కడ నుండి వెళ్లిపోయాయి.
ఆ కోయదొరలు పసి బిడ్డను ఎత్తుకొని తల్లిదండ్రుల కోసం అటు ఇటు తిరిగి చూశారు.
ఎక్కడా ఎవరూ కనిపించలేదు. దాంతో కోయదొరలు నేటి జగిత్యాల జిల్లా పోలవాసలో ఉన్న
వాళ్ళ గూడెంకు ఆ బిడ్డను తీసుకువచ్చారు. పోలవాస కోయదొర అయిన మేడరాజుకు జరిగిందంతా
చెప్పారు. అది విన్న మేడరాజు ఈ బిడ్డ మన
గూడెంకు ఆ భగవంతుడు ఇచ్చిన వరాల తల్లి అని, చెంతకు తీసుకుని దత్తత చేసుకున్నాడు. ఆ
బిడ్డకు మేడరాజు సమ్మక అని పేరు పెట్టాడు.
గూడెంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సమ్మక్క వారి బాధలు తీర్చేది.
రోజురోజుకీ సమ్మక్క మహిమలు పెరిగసాగాయి. గూడెంలోని జనాలు సమ్మక్కను దేవతా మూర్తిగా
ఆరాధించేవారు. మేడరాజు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తన చిట్టి తల్లి సమ్మక్కను
బయటివారికి ఇవ్వడం ఇష్టం లేక కాకతీయుల సామంత రాజుగా మేడారాన్ని పాలించే తన
మేనల్లుడు పగిడిద్ద రాజు కిచ్చి పెళ్లి చేశాడు. సమ్మక్క, పగిడిద్ద రాజులకు సారలమ్మ
, నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు, జంపన్న అను ఒక కుమారుడు జన్మించారు. సారలమ్మను
గోవిందరాజుకిచ్చి పెళ్లి చేశారు. రాజ్య విస్తరణకాంక్షతో కాకతీయరాజు అయిన ప్రతాపరుద్రుడు…. మేడరాజు పరిపాలిస్తున్న పోలవాసపై దండెత్తాడు.
యుద్ధంలో ఓడిపోయిన మేడరాజు అక్కడ నుండి పారిపోయి మేనల్లుడు పగిడిద్ద
రాజు దగ్గర ఆశ్రయం పొందాడు. మేడారంలో అదే
సంవత్సరం వర్షాలు సరిగా పడకపోవడంతో మునుపెన్నడూ లేని విధంగా భయంకరమైన కరువుకాటకాలు
సంభవించాయి. దాంతో ఆ సంవత్సరం పగిడిద్దరాజు ప్రతాపరుద్రుని కప్పము కట్టలేకపోతాడు.
ఓ వైపు తన శత్రువు అయినటువంటి మేడరాజుకు ఆశ్రయం ఇచ్చి మరోవైపు తమకు రావలసిన కప్పము
కట్టకపోవడంతో ఈ పగిడిద్దరాజు వాడి మామతో కలిసి కాకతీయ రాజ్యానికి వ్యతిరేకంగా ఏదో
కుట్ర చేస్తున్నాడని ప్రతాపరుద్రుడు భావించాడు. కోయ గిరిజనులలో కాకతీయ రాజుకు
వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రెచ్చగొడుతున్నాడని భావించిన ప్రతాపరుద్రుడు,
తన మంత్రి యుగంధరుడుతో కలిసి మహా సైన్యాన్ని వెంటపెట్టుకొని మాఘశుద్ధ
పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.
ప్రతాపరుద్రుడు తన సైన్యంతో మనపై యుద్దానికి వస్తున్నారని ఇప్పుడు మనం ఏం చేద్దామని కోయదొరలు పగిడిద్ద రాజుతో విన్నవించుకున్నారు. అప్పుడు పగిడిద్దరాజు మనం ఎవరి పైకి యుద్ధానికి పోము, ఎవరైనా మనపైన కత్తిదూస్తే తలదించం. ఆ ఓరుగల్లు రాజు ప్రతాపరుద్రునికి మన గిరిజన దెబ్బ ఏందో చూపిద్దాం.
ప్రతాపరుద్రుడు తన సైన్యంతో మనపై యుద్దానికి వస్తున్నారని ఇప్పుడు మనం ఏం చేద్దామని కోయదొరలు పగిడిద్ద రాజుతో విన్నవించుకున్నారు. అప్పుడు పగిడిద్దరాజు మనం ఎవరి పైకి యుద్ధానికి పోము, ఎవరైనా మనపైన కత్తిదూస్తే తలదించం. ఆ ఓరుగల్లు రాజు ప్రతాపరుద్రునికి మన గిరిజన దెబ్బ ఏందో చూపిద్దాం.
జంపన నువ్వు ఉత్తరం దిక్కునుండి సంపెంగవాగు దాటి రా ...
గోవిందరాజు నువ్వు దక్షిణం దిక్కు నుండి రా....
మేడరాజు మామ నువ్వు పడమటి దిక్కు నుండి రా...
నేను ముందునుండి ఆ సైన్యాన్ని ఎదుర్కొంటా అని చెప్పాడు పగిడిద్ద రాజు.
అప్పుడు మేడరాజు పగిడిద్ద రాజుతో అల్లుడు కాకతీయ సైన్యం లక్షల్లో
ఉన్నారు. నువ్వు ఒక్కడివే ఎలా ఎదుర్కుంటావు? మేము కుడా నీతోనే ఉంటాము...
చావైనా బతుకైనా ఒక్కడిగా సద్దాం అని మేడరాజు కన్నీరుమున్నీరయ్యాడు.
సమయం లేదు మామ అని చెప్పి జంగ్ సైరన్ జమయించాడు. తుడుములు
మొగినై..యుద్ధం మొదలైంది. ఒక్కొక్క కోయదొర
పది మంది కాకతీయ సైనికులతో పోరాడుతున్నాడు దొరికిన వారిని దొరికినట్లు ఊచకోత
కోస్తున్నారు. కానీ అపారమైన కాకతీయ సైన్యం దాటికి వందల్లో ఉన్న కోయదొరలు సైన్యం ఎక్కువ సేపు నిలువలేక
పోయారు. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతూ పగిడిద్దరాజు తుది శ్వాస విడిచాడు.
మరోవైపు దక్షిణం దిక్కు నుండి అల్లుడు గోవిందరాజు, పడమటి దిక్కు నుండి మేడరాజు
మూకుమ్మడిగా దాడి చేశారు. కోయదొరల అనూహ్య గెరిల్లా దాడితో బిత్తరపోయిన కాకతీయ
సైన్యం రెండుగా చీలిపోయింది. భయంకరంగా జరిగిన ఆ యుద్ధంలో మేడరాజు, గోవిందరాజు
ఇద్దరు మరణించారు. తమ భర్తలు మరణించారనే వార్త తెలియగానే సమ్మక్క-సారక్కలు,
నాగులమ్మ కత్తిపట్టి యుద్ధానికి సై అన్నారు. ఆ దుర్గాదేవే వచ్చి యుద్ధం చేస్తుందా
అన్నంత రీతిలో సమ్మక్క-సారక్కలు శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడిన సాగారు.
వేల్లల్లో ముందునుండి వస్తున్న సైన్యాన్ని ఎదుర్కొంటూ తన కత్తిని గిరగిరా తిప్పుతుంటే
శత్రువుల తలలు నేలరాలుతున్నాయి. ఆ భయంకర దృశ్యం చూసి ప్రతాపరుద్రునికి భయంవేసింది మహామంత్రి
నేను ఎన్నో యుద్ధాలు చూశాను, ఎన్నడూ ఇంత భయంకర శత్రువును చూడలేదు. మహామంత్రి
మరికొంతసేపు సమ్మక్క కత్తి ఇలాగే తిప్పిందంటే ఈ భూమ్మీద కాకతీయుల అస్తిత్వం ఉండదు
ఎలాగైనా ముంచుకొస్తున్న ఈ ఉప్పెనకు ఆడ్డుకట్ట వేయాలి.
మన సైనికులను కొంతమందిని వెనక వైపు నుండి పంపించి దాడి చేయమని
ఆజ్ఞాపిస్తాడు. అలా కాకతీయ సైన్యం యుద్ధం నియమాలను తుంగలో తొక్కి వెనకనుండి
సమ్మక్క సారక్కలను కత్తితో పొడుస్తారు దాంతో సారక్క అక్కడికక్కడే మరణిస్తుంది.
మరోవైపు ఉత్తరదిశగా సంపెంగ వాగు దాటి వస్తున్న జంపన్న పై అటుగా కోయదొరలు వస్తారని
ముందుగానే ఉహించి ప్రతాపరుద్రుడు పంపించిన కాకతీయ సైనికులు విరుచుకుపడ్డారు జంపన్న
తన కొద్దిపాటి సైన్యంతో కాకతీయుల
సైన్యాన్ని ఎదురించి సంపెంగవాగులో వీరమరణం పొందాడు. దాంతో ఆ సంపెంగ వాగు కు అతని
పేరు మీద జంపన్నవాగు అని పేరు వచ్చింది. జంపన్నవాగులోని నీరు ఇప్పటికి జంపన ప్రాణ
త్యాగానికి గుర్తుగా ఎరుపు రంగులోనే కనిపించడం మరో విశేషం. సమ్మక్క సారక్కలను
దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు
తప్పనిసరిగా జంపన్న వాగు దగ్గర ఆగి ఆ నీటిలో స్నానం చేసి పవిత్రులవుతారు. ఆ వాగులో
స్నానం చేస్తే భయాలన్నీ పటాపంచలై జీవితమనే
సముద్రాన్ని ఈదడానికి కొండంత ధైర్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శత్రువుల
చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుండి
నిష్క్రమిస్తూ.... నేను ప్రతి రెండేళ్ళకొకసారి
వస్తానని కోయదొరలకు మాటిచ్చి చిలుకల గుట్ట వైపు వెళ్ళింది... కొంతసేపటికి కోయదొరలు చిలుకల గుట్టకు వెళ్లగా
ఎక్కడ సమ్మక్క జాడ కనిపించలేదు. కానీ ఆ
ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల భరిణె లభించినది. దాన్ని సమ్మక్కగా
భావించి అప్పటి నుండి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క
జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపు కుంటున్నారు. సమ్మక – సారక్కల శాపంతోనే సువిశాల కాకతీయ సామ్రాజ్యం అర్ధాంతరంగా పతనమైందని
గిరిజనులు బలంగా నమ్ముతారు.
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు.
రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న
సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్టించే సమయములో
భక్తులు పూనకంతో ఊగి పోతారు.
మూడవ రోజున సమ్మక్క సారక్కలు గద్దెలపై కొలువు తీరుతారు.
వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర మరో ప్రత్యేకత.
తమ కోరికలను తీర్చమని లక్షలాది భక్తులు సమ్మక్క సారక్కలకు బంగారం నైవేద్యంగా సమర్పిస్తారు. బంగారం అంటే బెల్లం అని అర్థం అప్పట్లో బెల్లానికి
చాలా విలువ ఉండేది అదీకాక సమ్మక్క భర్త పగిడిద్దరాజులో మొదటి మూడు అక్షరాలు పగిడి
అంటే బెల్లం అని అర్థం అలా బెల్లం రూపంలో బంగారం అనే పేరు గల పగిడిద్ద రాజును సమ్మక్క
చెంతకు చేర్చితే తాము ఏం కోరిన అమ్మవారు తప్పకుండా తీరుస్తారని భక్తుల నమ్మకం.
మొదట్లో కేవలం ఈ జాతరను కేవలం గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు కానీ సమ్మక్క
సారక్క లీలలు ఎల్లలుదాటిపోవడంతో ఇప్పుడు కోట్లాది భక్తులు అమ్మవారి దర్శనం కోసం
బారులు తీరుతున్నారు. అదీకాకుండా సమ్మక్క సారక్కలు స్వయంగా కుంకుమ రూపంలో ఇక్కడికి వస్తారు దానంతట అదే ప్రకృతిసిద్ధంగా అక్కడ
ప్రత్యక్షమౌతున్న కుంకుమే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం.
Sammakka Sarakka Real Story || Samakka Sarakka Charitra || Medaram Jatara 2020 || Hello TV
Reviewed by Kirthi Reddy
on
January 28, 2020
Rating:
No comments