Sammakka Sarakka Jatara Story In Telugu
Sammakka Sarakka Jatara Story In Telugu
భారతదేశంలోని అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణలోనే జరుగుతుంది.
అదే మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న ఈ మేడారం
ఓ దట్టమైన అడవి ప్రాంతం. ఇక్కడ జరిగే సమ్మక్క-సారక్క జాతరకు దాదాపు 700 ఏళ్ల చరిత్ర ఉంది. ఇంతకీ సమ్మక్క సారక్క ఎవరు ? ఈ జాతర ఎలా మొదలైందో
ఇప్పుడు తెలుసుకుందాం....
13వ శతాబ్దంలో మేడారం చుట్టుపక్కల ప్రాంతం అంతా ఓరుగల్లు
రాజులైన కాకతీయుల పాలనలో ఉండేది. అవడానికి అడవులే అయినా కరువు కాటకాలు వస్తే
మాత్రం ఇక్కడ తాగేందుకు గుక్కెడు మంచినీరు కూడా దొరికేది కాదు. అలా కష్టనష్టాల
మధ్య బతుకుతున్న కోయదొరలు ఒకసారి వేటకని బయలుదేరారు. వేట కోసం తిరుగుతున్న వాళ్ళకి
అడవిలో ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఓ పసిపాప పుట్టమీద పడుకుని కేరింతలు
కొడుతుంది.
ఆ పసిపాపకు కాపలాగా పులులు సింహాలు ఆమె చుట్టూ
తిరుగుతున్నాయి. ఆ అద్భుతాన్ని చూసిన వాళ్ళు ఆ పాప తమ పాలిట వచ్చిన దేవత
అనుకున్నారు... ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి గారాబంగా పెంచసాగారు. సమ్మక్క
నిజంగానే దేవతలా ఉండేది. సమ్మక్క చేత్తో మందిస్తే చాలు ఎలాంటి రోగమైన ఇట్టే
నయమైపోయేది.
యుక్తవయసుకు వచ్చిన సమ్మక్కని మేడారం ప్రాంతాన్ని పాలించే పగిడిద్దరాజుకి
ఇచ్చి ఘనంగా పెళ్ళి చేశారు. కొంతకాలానికి వారికి జంపన్న , సారక్క,
నాగులమ్మ అని వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు. అంతా సవ్యంగా
గడిచిపోతున్న సమయంలో కరువు మళ్లీ పగబట్టింది. మరోపక్క ఏటా కట్టే కప్పం కట్టమని
ఓరుగల్లు రాజైన ప్రతాపరుద్రుడు కబురు పంపాడు. కరువు వల్ల కప్పం కట్టలేమని పగిడిద్దరాజు
ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది రాజుగారి మనసు కరగలేదు సరికదా, కప్పం కట్టనందుకు పగిడిద్దరాజు మీద యుద్ధం ప్రకటించాడు. వేలాది మంది
కాకతీయ సైనికులు ఏనుగులు , గుర్రాలతో మేడారం మీదికి దండెత్తారు.
సంపంగి వాగు అనే చోట భీకరమైన యుద్ధం మొదలైంది. ప్రతాపరుద్రుని సైన్యం తో పోలిస్తే
మేడారంలోని ప్రజల సంఖ్య చాలా తక్కువ, వారి దగ్గర సరైన
ఆయుధాలు కూడా లేవు , అయినా ఒక్కొక్క గ్రామస్తుడుఒక వీరుడిలా
మారి శత్రుసైన్యం మీదికి ఉరికారు. నిమిష నిమిషానికి పగిడిద్దరాజును ఎదుర్కోవడం
శత్రువులకి కష్టమైపోతోంది. దాంతో ఆయన్ని అందరూ ఒక్కసారిగా చుట్టుముట్టి చంపారు.
భర్త చనిపోయిన వార్త విన్న సమ్మక్క తన పిల్లలతో అల్లుడు
గోవిందరాజు తో కలిసి యుద్ధంలోకి దూకింది. సమ్మక్క దెబ్బకి యుద్ధరంగమే మారిపోయింది.
సమ్మక్క వేసే ఒక్కో వేటుకి పదేసి మంది శత్రువులు నేలకులసాగారు . రాన్రాను యుద్ధంలో
సమ్మక్కది ఫై చేయి కాసాగింది, సమ్మక్క-సారక్కలు ఉన్నంత సేపు
యుద్ధంలో తాము గెలవలేమని వారికి అర్థం అయిపోయింది. దాంతో వారిద్దరి వెనకనుంచి
పొడుస్తారు. చాటు నుంచి బాణాలు వేసి వాళ్ళ శరీరాలను జల్లెడ గా మార్చేశారు. ఒంట్లో
వందలాదిగా బాణాలు దిగడంతో సారలమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. మరోపక్క సమ్మక్క
కొడుకైన జంపన్న సంపెంగ వాగులో చివరి శ్వాస విడిచాడు. అప్పటినుంచి అది జంపన్న
వాగుగా పిలవబడుతోంది. సమ్మక్క మాత్రం ఒంటినిండా గాయాలతో నడుచుకుంటూ చిలకలగుట్ట అనే
ప్రాంతానికి వెళ్ళింది, ఆమెను అనుసరిస్తూ వెళ్లని వారికి
సమ్మక్క కనిపించలేదు... బదులుగా ఒక చెట్టు కింద కుంకుమ భరణి కనిపించింది. సమ్మక్కే
ఆ కుంకుమ భరణి గా మారిపోయింది అని భక్తుల నమ్మకం.
ఇదంతా జరిగి వందల ఏళ్లు గడిచినా ఇప్పటికీ సమ్మక్క తనభక్తులను
కాపాడుతూ వస్తుంది అని నమ్మకం. అందుకే సమ్మక్క - సారక్క పేరిట ప్రతి రెండేళ్ళ
కొకసారి మాఘ మాసంలో గొప్ప జాతర జరుపుకుంటారు. ఆ సమయంలో కుంకుమ భరిణె రూపములో ఉన్న
సమ్మక్కను చిలుకల గుట్ట నుంచి మేడారానికి తీసుకొస్తారు. సమ్మక్క భరణి ఉంచిన గద్దె
పక్కనే... ఆమె కుమార్తె సారలమ్మకి కూడా మరొక గద్దెను ఏర్పాటు చేస్తారు. జాతర లో
కొలువైన సమ్మక్క-సారక్కలను పూజించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాల నుంచే కాదు దేశం లోని ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు
తరలివస్తారు.
భక్తులంతా ముందుగా జంపన్నవాగులో స్నానం చేసి
సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటారు. తమ మొక్కు తీర్చుకునేందుకు కిలోల కొద్దీ
బెల్లాన్ని నైవేద్యంగా అర్పిస్తారు. ఈసారి కూడా జాతరకు వచ్చేందుకు
సమ్మక్క-సారక్కలు పూజించుకునే లక్షలాది మంది భక్తుల సిద్ధమవుతున్నారు.
Sammakka Sarakka Jatara Story In Telugu
Reviewed by Kirthi Reddy
on
February 07, 2020
Rating:
Reviewed by Kirthi Reddy
on
February 07, 2020
Rating:




No comments